1వ సమూయేలు 20:30-34
ప్రభువునందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.
దేవుని గ్రంధములో మనమనేక ఆత్మీయవిషయములను నేర్చుకొనగలము. మన అత్మీయస్థితి ఉన్నతంగా ఉంచుకోవటానికి అనేక సంగతులు, ఉదాహరణలు, దృష్టాంతములు, హెచ్చరికలు వగైరాలు వ్రాయబడియున్నాయి.
పైన పేర్కొన్న వాక్యభాగములో ఒకని తండ్రే తన కుమారునికి శత్రువుగా మారి, చంపుటకు ప్రయత్నించిన సందర్భమును తెలుసుకుందాము.
ఇక్కడ, ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలు, అతని మొదటి కుమారుడైన యోనాతానును చూడవచ్చు. ఈ తండ్రికొడుకులు ఎందువలన ఆ పరిస్థితిలోనికి వెళ్ళారో గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన సంగతులను విశ్లేషించగలము. అవేంటంటే,
1) అసూయ 2) స్నేహం
1) అసూయ:- దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపడమువలన ప్రజలలో సౌలు రాజు కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. సౌలు వేలకొలది, దావీదు పదివేలకొలది అనే మాటలు అస్సలు గిట్టలేదు. తనకంటే గొప్ప పేరు దావీదునకు రావడంవలన తన హృదయములో క్రోధం, ఆగ్రహం & ద్వేషభావం పెంచుకుంటూ ఉన్నాడు. ఎంత అంటే, దావీదును తన ఈటెతో గోడకు దించి చంపుదామన్నంత. అయినా దావీదు సౌలుయొక్క ద్వేషమును ఎరుగక, రాజుకొలువులో తన పని తాను చేసుకుంటూ ఉన్నడు. ఎప్పుడైతే గ్రహించాడో, అప్పటినుండి తప్పించుకుంటున్నాడు. ఇద్దరూ దేవునిచేత ఎన్నికచేయబడిననూ, వయస్సులోను, అనుభావములోను పెద్దవాడైన సౌలు, దేవుని నియమమును గౌరవించక, నైతికంగా పతనమయ్యాడు. అదే సమయంలో దావీదుకు సౌలు ఒక గుహలో దొరికినా, తన సేవకులు సౌలును హతమార్చు అని చెప్పినా, కేవలం దేవుని అభిషేకంపొందినవాడని ఏ హానీచేయ్యలేదు.
"అసూయ ఒక మనిషిని ద్వేషంతోనింపి హత్య చేయుటకు కారణమవ్వగలదు."
2) స్నేహం:- తన తండ్రి దావీదును చంపాలని తిరుగుచున్నప్పుడు, దావీదుకు నిజమైన సహకారమును, ఓదార్పును, ఆపదనుండి తప్పించిన
ఒక స్నేహితునిగా యోనాతాను నిలిచాడు. దావీదుకోసం తన ప్రాణమును సైతం లెక్కచెయ్యకుండా దేవుని పక్షముగాను, దేవునిచేత అభిషేకంపొందినవాని పక్షముగానూ ఉండటం ఎంతో గమనార్హమైన విషయం. దావీదుకు ప్రాణరక్షణ అందించడంలో తన తండ్రిచేత తనూ, తన తల్లినూ ఎన్నో దూషణమాటలు పడవలసివచ్చింది.
"స్నేహం ఒక మనిషిని ప్రాణాపాయమునుండి తప్పించగలదు, తన ప్రాణమును సైతం పెట్టగలదు."
కావున ప్రియులైన మీరందరూ, దేవునిచేత వాడబడువారిని ప్రేమించుచు, వారుకూడా మన దేవుని కొరకే పాటుపడుచున్నారని ఎరిగి, అసూయపడకుండా ప్రోత్సహించుదాం. ఆనాడు దేవుని రాజ్యమైన ఇశ్రాయేలీయులకు సౌలు రూపంలో పరోక్షంగా & ప్రత్యక్షంగా హానిజరిగినట్టుగా, నేడు దేవుని రాజ్యమైన సంఘములో అసూయతోనున్న ఏ వ్యక్తివల్ల హానిజరగకుండునట్లు నడుచుకుందాం. అందరినీ ప్రేమించుదాం. అందరితో స్నేహముగా ఉంటూ దేవుని నియమములను కొనసాగించుదాం.
వందనములు.
మీ ప్రియ సోదరుడు,
రాజా విజయ్ కుమార్.వి
రాజమండ్రి.
Comments